: శశికళతో జగన్ ని పోల్చిన వర్ల రామయ్య!
అక్రమాస్తుల కేసులో జైలు పాలైన శశికళతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ని ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య పోల్చారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఆంధ్రా శశికళ కావడం, ఇవాళో రేపో జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. శశికళ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ లో వణుకు పట్టుకుందని, రూ.60 కోట్ల అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడితే, వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో జగన్ కు ఎన్నేళ్లు శిక్ష పడాలి? అసలు ‘యువభేరీ’ ద్వారా తన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని జగన్ యువతకు సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు. శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు అవినీతి రాజకీయ నాయకులకు చెంపపెట్టులాంటిదని వర్ల రామయ్య అన్నారు.