: జైలుకు వెళ్లినా.. తన మాటే నెగ్గించుకున్న చిన్నమ్మ!
తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తిన నాటి నుంచి ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. పన్నీర్ సెల్వంతో ముఖ్యమంత్రి పదవికి బలవంతంగా రాజీనామా చేయించడం, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా తాను ఎన్నికయ్యానని శశికళ ప్రకటించడం, సీఎం కుర్చీపై తానే కూర్చుంటానని ఆమె అనడం వంటి పలు ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి.
అయితే, తనకు దక్కుతుందనుకున్న సీఎం కుర్చీ చేజారడమే కాకుండా, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చిన ‘చిన్నమ్మ’కు తీరని నిరాశే మిగిలింది. అయినప్పటికీ, తన వర్గీయుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టుకోవాలన్న తన పంతాన్ని మాత్రం ఆమె నెగ్గించుకుంది. చిన్నమ్మకు సీఎం పీఠం దక్కకపోయినా ఫర్వాలేదు, పన్నీర్ కు ఆ పీఠాన్ని దక్కనివ్వమన్న శశికళ వర్గీయుల మాటలు ఈరోజు నిజమవడం గమనార్హం.
ఇందుకుగాను, శశికళ ఎత్తుగడలు, వ్యూహప్రతివ్యూహాలు, రాజకీయ సమీకరణలు, తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు తన నుంచి జారిపోకుండా తీసుకున్న చర్యలు.. తెలిసినవే. తనకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని అనుకున్న పన్నీర్ కు నిరాశ మిగలగా, సీఎం పీఠం దక్కక, జైలు పాలై చెప్పలేని మనోవేదన అనుభవిస్తున్న శశికళకు, తన వర్గీయుడు పళనిస్వామి ముఖ్యమంత్రి కావడంతో కొంతలో కొంత ఊరట లభించింది.