: యువత కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి: యువభేరీలో జ‌గ‌న్


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ గుంటూరులో ఈ రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి త‌ల‌పెట్టిన యువ‌భేరీ ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. ‘అందరి చేతుల్లో ఇప్పుడు 3జీ, 4 జీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మీ త‌ల్లిదండ్రుల‌ను అడ‌గండి, న‌ల‌భై ఏళ్ల కింద‌ట వారి వ‌ద్ద క‌నీసం గ్రామ్ ఫోన్లు కూడా లేవు. ఇంట్లో ఫోన్ ఉంటే చాలా సంప‌న్న కుటుంబంగా ప‌రిగ‌ణించేవారు.

క‌రెంటు లేని గ్రామాలు క‌నిపించేవి, టీవీ చూడాలంటే దూర‌ద‌ర్శ‌న్ మాత్ర‌మే ఉండేది.. ఊరికి ఒక‌రు లేదా ఇద్ద‌రి ఇంట్లోనే టీవీలు ఉండేవి. ఈ విష‌యాల‌న్నీ ఎందుకు చెప్ప‌వ‌ల‌సి వస్తుందో తెలుసా?  ఏ ప్రాంత ప్ర‌జ‌ల‌యినా మొన్న‌టి కంటే నిన్న.. నిన్న‌టి క‌న్నా నేడు బాగుండాల‌ని కోరుకుంటారు. అలాగే పురోగ‌తి చెందుతూ వ‌చ్చింది. అన్ని ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి జ‌ర‌గాలి, అంత‌కు ముందు సాధించిన ప్ర‌గ‌తి కంటే మ‌రింత ప్ర‌గ‌తి సాధించాలి.. కానీ, మన రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి చెందే అవకాశాలు తగ్గిపోతున్నాయి’ అని జగన్ వ్యాఖ్యానించారు.

హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు న‌గ‌రాలు ఎంతో అభివృద్ధి చెందాయ‌ని జ‌గ‌న్ అన్నారు. హైద‌రాబాద్‌లో ఎన్నో ప్రైవేటు, ప్ర‌భుత్వ క‌ర్మాగారాలు ఉన్నాయ‌ని చెప్పారు. ‘యువత కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఎన్నో సంస్థ‌లు, ఫ్యాక్ట‌రీలు హైద‌రాబాద్‌లో క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వాలు అందించిన తోడ్పాటుతో అభివృద్ధిలో ఆ న‌గ‌రాలు దూసుకుపోతున్నాయి. అయితే, ఏపీలో అలాంటి సంస్థ‌లు రావాలంటే ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సాయం అంద‌డం లేదు' అని ఆయ‌న ఆరోపించారు.

ఇన్నాళ్లు సుస్థిరంగా సాగుతూ వ‌స్తోన్న అభివృద్ధి చంద్ర‌బాబు నాయుడి పాల‌నతో మ‌రింత ముందుకు వెళ్లే ప‌రిస్థితులు క‌న‌ప‌డ‌డం లేదు. రాష్ట్రాభివృద్ధి జ‌ర‌గాలంటే ప్ర‌త్యేక హోదా లేనిదే సాధ్యం కాదు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఏపీలోని యువ‌త ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల‌కు వెళ్లే అవ‌స‌రం ఉండ‌బోదు’ అని జగన్ వ్యాఖ్యానించారు. 

  • Loading...

More Telugu News