: పథకాల్లో ‘అమ్మ’ ఫొటో ఇక కనిపించదా?


అమ్మ.. అమ్మ.. నిన్నమొన్నటి వరకు తమిళనాడులో ఈ మాట తప్ప మరొకటి వినిపించలేదు. పథకమేదైనా జయలలిత ఫొటో తప్పనిసరి. ఇప్పుడు అది గతం కాబోతుందా? ‘అమ్మ’ అభిమానులను ఇప్పుడీ ప్రశ్న వేధిస్తోంది. అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు జయలలితను కూడా సుప్రీం ధర్మాసనం దోషిగా తేల్చింది. శశికళ జైలుకు వెళ్లారు. జయలలిత బతికి లేకున్నా ఆమె కూడా దోషేనని కోర్టు తేల్చింది. ఇప్పుడు ‘అమ్మ’ సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, ‘అమ్మ’ ఆశయసాధన కోసం కృషి చేస్తామంటూ అన్నాడీఎంకేలోని రెండు వర్గాలూ చెబుతున్నాయి. మరి అధికారంలోకి వచ్చాక కోర్టు దోషిగా తేల్చిన జయ ఫొటోను వారు ఇక ముందు కూడా వాడుకుంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కోర్టు దోషిగా తేల్చిన వారికి ప్రజలు ఏమేరకు గౌరవం ఇస్తారన్నది కూడా ప్రశ్నగా మారింది. కాబట్టి ఇక నుంచి ‘అమ్మ’ పథకాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫొటో కనిపించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాదు..  నిన్నటి వరకు జయలలితకు భారతరత్న ఇవ్వాలని, పార్లమెంటు ఆవరణలో విగ్రహం పెట్టాలని, తమిళనాడు శాసనసభలో ఆమె ఫొటో పెట్టాలని.. పలు డిమాండ్లు బయటకొచ్చాయి. ఇప్పుడీ డిమాండ్లను లేవనెత్తే ధైర్యం ఎవరికి ఉందన్న ప్రశ్న ‘అమ్మ’ అభిమానులను తొలిచేస్తోంది. కోర్టు తీర్పుతో జయ సమాధి పరిసరాలను స్మారక కేంద్రంగా మార్చేందుకు కూడా ప్రభుత్వం నిధులు వెచ్చించే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసినా ‘అమ్మ’ బొమ్మపై మరోమారు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ జయ బొమ్మను ఏర్పాటు చేస్తే కనుక చిక్కుల్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని చెబుతున్నారు. మరి అధికారంలోకి వచ్చేవారు ‘అమ్మ’ భక్తిని ఎలా చాటుకుంటారో వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News