: ట్రంప్ నిర్ణయాలు టెక్కీలకు ఆశీర్వాదమే: ముఖేష్ అంబానీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వీసా నిర్ణయాలు ఓ రకంగా భారత ఐటీ ఇండస్ట్రీకి, ఇక్కడి టెక్నాలజీ నిపుణులకు మరిన్ని మంచి అవకాశాలను దగ్గర చేయనుందని, ఇండియాలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు. నాస్కామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న లీడర్ షిప్ ఫోరమ్ లో పాల్గొని ప్రసంగించిన ఆయన, ట్రంప్ ఆంక్షలతో దేశవాళీ ఐటీ రంగం సమస్యల పరిష్కారానికి కృషి చేసి, అతిపెద్ద ఐటీ మార్కెట్ లో సత్తా చాటేలా లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ట్రంప్ రక్షణాత్మక విధానం వాస్తవానికి ఆశీర్వాదం వంటిదేనని ఆయన అన్నారు. 155 బిలియన్ డాలర్లకు ఐటీ పరిశ్రమ ఎదిగిందని గుర్తు చేసిన ఆయన, మొత్తం ఆదాయంలో 65 శాతం అమెరికా నుంచే వస్తున్నదని, ఈ పరిస్థితిని మార్చే అవకాశాన్ని ట్రంప్ మన ముందుంచారని అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఐటీ ఇండస్ట్రీ వృద్ధి గణాంకాలను గతంలో ప్రకటించిన 10 నుంచి 12 శాతం బదులు 8 నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్టు నాస్కామ్ పేర్కొంది.