: దీపక్‌కు ‘వేదనిలయం’.. మరి జయ ఇతర ఆస్తుల మాటేమిటి?
శశికళ జైలుకు వెళ్తూ వెళ్తూ జయ నివాసం వేద నిలయాన్ని ఆమె అన్న కుమారుడు దీపక్‌కు అప్పగించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు దీపక్‌కు వేదనిలయాన్ని అప్పగించేందుకు శశికళ బృందం సిద్ధమైంది. జయ సోదరుడు జయకుమార్‌కు కుమారుడు దీపక్, కుమార్తె దీప ఉన్నారు. జయ జీవించి ఉన్న కాలంలో వీరి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె మరణానంతరం ఈ కుటుంబం గురించి బయటకు తెలిసింది. ముఖ్యంగా దీప పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా సుప్రీం తీర్పుతో శశికళ జైలుకు వెళ్లడంతో వేదనిలయానికి ఉన్న భద్రతను పోలీసులు ఉపసంహరించుకున్నారు. దీంతో ఆ ఇంటిని అలానే వదిలేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని, కాబట్టి దానిని దీపక్‌కు అప్పగించడమే మంచిదని శశికళ వర్గం భావిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా జయలలితకు కాంచీపురం జిల్లాలోని సిరుదావూర్‌లోని బంగళా, నీలగిరి జిల్లా కొడనాడులో తేయాకు ఎస్టేట్, ఇతర స్థిర, చరాస్తులు ఉన్నాయి. మరి ఇవి ఎవరికి చెందుతాయనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి.