: ఆ వంద కోట్లు కట్టేదెవరు?.. సుప్రీం తీర్పులో కనిపించని స్పష్టత!
అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ రూ.వంద కోట్లు కట్టాలంటూ కింది కోర్టు విధించిన జరిమానాను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే జయ మరణంతో ఆమెకు సంబంధించిన అన్ని అప్పీళ్లను కోర్టు నిలిపివేసింది. మరి జరిమానా రూ.వంద కోట్లు ఇప్పుడు ఎవరు కడతారనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. కోర్టు తీర్పు ప్రకారం జయ రూ.వంద కోట్ల జరిమానా చెల్లించాల్సిందే. అయితే సుప్రీం తీర్పులో జరిమానా ఎలా వసూలు చేయాలన్న దానిపై ఎక్కడా స్పష్టత లేదు. సుప్రీం తన 570 పేజీల తీర్పులో దోషులకు చెందిన ఆరు కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని చెప్పినా, దీనికి రూ.100 కోట్ల జరిమానాకు సంబంధం లేదు.
జయలలిత మరణించడంతో ఆమెపై క్రిమినల్ చర్యలను రద్దు చేసిన కోర్టు ఆమె కట్టాల్సిన జరిమానాను మాత్రం రద్దు చేయలేదు. అయితే జయ ఎస్టేట్ నుంచి జరిమానాను వసూలు చేయవచ్చని సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ హెగ్డే అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు మాత్రమే స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జరిమానా వసూలు చేయాల్సిందేనని కనుక ఆదేశిస్తే జయకు ఉన్న చాలా ఆస్తుల్లో కొన్నింటిని విక్రయించి కట్టవచ్చు. మరోవైపు ఇదే కేసులో జయ నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా ఒక్కొక్కరికీ రూ. 10 కోట్ల చొప్పున సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఈ జరిమానాను కూడా ఎలా వసూలు చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.