: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైకి పదవీ గండం.. శశికళకు మద్దతు పలకడమే కారణం!
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత ఎం.తంబిదురై త్వరలో తన పదవిని కోల్పోనున్నట్టు సమాచారం. జయలలిత మరణానంతరం శశికళకు అండగా నిలిచిన ఆయన పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించడంలో కీలకపాత్ర పోషించారు. తద్వారా ‘చిన్నమ్మ’ను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని భావించారు. అయితే సుప్రీం తీర్పుతో శశికళ ఆశలు అడియాసలయ్యాయి.
ఇక జయలలిత మృతి తర్వాత శశికళ వ్యవహరించిన తీరు అటు బీజేపీతోపాటు ఇటు ప్రధాని నరేంద్రమోదీకి సైతం ఆగ్రహం తెప్పించింది. అయితే, తంబిదురై మాత్రం శశికళకు అండగా నిలుస్తూ వీలుదొరికినప్పుడల్లా బీజేపీపై, ప్రధానిపై విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా శశికళకు తంబిదురై అండగా నిలిచారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి ఆయనను తప్పించి ఆ స్థానంలో పన్నీర్ వర్గంలోని 11 మంది ఎంపీలలో ఒకరిని కూర్చోబెట్టాలని మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరొకరికి కేంద్ర సహాయమంత్రి పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.