: శశికళపై కిడ్నాప్ కేసు పెట్టిన ఆన్నాడీఎంకే ఎమ్మెల్యే
వారం రోజుల క్రితం శశికళ క్యాంపు రాజకీయాల్లో భాగంగా గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి, ఆపై ఆమె వర్గానికి హ్యాండిచ్చి, తప్పించుకు వచ్చి పన్నీర్ వర్గంలో చేరిన అన్నాడీఎంకే శాసనసభ్యుడు శరవణన్, కిడ్నాప్ కేసు పెట్టారు. తనను శశికళ, ఎడప్పడి పళనిస్వామిలు కిడ్నాప్ చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. శరవణన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించినట్టు సమాచారం.
ఇక నేడు లొంగిపోయేందుకు బెంగళూరుకు బయలుదేరిన శశికళ, అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ, రెండు వారాల సమయం ఇవ్వాలని బెంగళూరు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఉదయం ఇదే తరహా పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయగా, న్యాయమూర్తులు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, సుప్రీంకోర్టు ఆదేశాలపై అతిత్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నామని లోక్ సభ డిప్యూటీ స్పీకర్, అన్నాడీఎంకే నేత తంబిదురై వెల్లడించారు. చిన్నమ్మ తప్పకుండా వెనక్కు వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తారన్న నమ్మకం తనకుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.