: ముంబై విమానాశ్రయంలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు చేదు అనుభవం!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్ పర్యటన ప్రారంభమైంది. ఈ నెల 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య పూణే వేదికగా తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, భారత్లోని ముంబయి ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. బీసీసీఐ వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎయిర్పోర్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అవస్థలు పడ్డారు. ఎయిర్పోర్టు నుంచి బయటికి వచ్చే సమయానికి వారి బ్యాగుల్ని తీసుకెళ్లే వాళ్లెవ్వరూ కనిపించకపోవడంతో ఆ ఆటగాళ్లే తమ బ్యాగుల్ని మోశారు.
మామూలుగా అయితే, బోర్డు వారి కోసం ఏర్పాట్లు చేయాలి. కానీ, అటువంటి ఏర్పాట్లు చేసిన దాఖలాలు కనిపించలేదు. దీంతో తమ వద్ద ఉన్న పెద్ద పెద్ద కిట్ బ్యాగుల్ని మోసుకుంటూ వాటిని సదరు ఆటగాళ్లు బయటికి తీసుకొచ్చారు. తమ చేతులతోనే ఎత్తి మరీ కిట్ బ్యాగులను తీసుకెళ్లే వ్యానులో వాళ్లే లోడ్ చేసుకున్నారు.