: ర్యాలీని విరమించుకునే ప్రసక్తేలేదు: ప్రొ.కోదండరాం
తెలంగాణ సాధించుకున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం ఈనెల 22వ తేదీన జేఏసీ నిరుద్యోగుల ర్యాలీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీని విరమించుకునే ప్రసక్తేలేదని ఆయన ఈ రోజు పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇస్తేనే ర్యాలీ విరమించుకునే ఆలోచన చేస్తామని అన్నారు.
ఈ రోజు ఆయన వరంగల్ లో మాట్లాడుతూ... ఈ ర్యాలీని జేఏసీ ప్రతిష్ట కోసం ర్యాలీ చేపట్టడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ యువకుల ఆవేదనను తెలియజేయడానికే తాము ఆ నిరసన తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. అలాగే ప్రైవేటు రంగంలో స్థానిక నిరుద్యోగులకు రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగాలు వచ్చేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.