: కల చెదిరింది...కథమారింది...కన్నీరే మిగిలింది!
తమిళనాడు ఏఐఏడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ శశికళ ముఖ్యమంత్రి కలచెదిరింది...అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరుస్తూ ఆమెను దోషిగా పేర్కొని పదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆదేశించడంతో ఆమె పదిలంగా అల్లుకున్న రాజకీయ జీవిత కధ పూర్తిగా మారిపోయింది. పైబడిన వయసు, ఆత్మీయురాలు అందుబాటులో లేకపోవడం, తమిళనాడు జైల్లో ఉంచుతారో లేక కర్ణాటక జైల్లో ఉంచుతారో తెలియని మీమాంస, తమిళనాట తన విధేయులు పగ్గాలు చేపడతారో లేక ప్రత్యర్థి పన్నీరే పగ్గాలు చేపడతాడోనన్న ఆందోళన.. నేపథ్యంలో శశికళకు కన్నీరే మిగిలింది. ఈ నేపథ్యంలో జయలలిత కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం అనాధగా మారింది.
జయలలిత మరణానంతరం పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో మకాంపెట్టిన శశికళ...ఇకపై జయలలిత సామ్రాజ్యం మొత్తం తనదే అన్నట్టు వ్యవహరించారు. శశికళ మరో మూడేళ్లపాటు జైలులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత సంపాదించిన ఆస్తులు, పార్టీ భవిష్యత్ అంతా అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా కనిపిస్తోంది. ఇంతవరకు జయలలిత రాసిన వీలునామాలు కానీ, ఇతరత్రా పత్రాలు కానీ వెలుగు చూళ్లేదు. శశికళ కూడా అధికారం చేపట్టే దిశగా పావులు కదిపారే కానీ, ఆ విషయంపై దృష్టి పెట్టలేదు. ఈ నేపధ్యంలో ఆమెకు శిక్ష ఖరారు కావడంతో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటన్నది జయలలిత అభిమానుల ఆవేదన.