: ‘నేనొక లాయర్ ను పక్కకు తప్పుకోండి’ అంటూ హైకోర్టు వద్ద రౌడీషీటర్ అలజడి
‘నేనొక లాయర్ ను పక్కకు తప్పుకోండి’ అంటూ ఓ రౌడీషీటర్ హైదరాబాద్ హైకోర్టు దగ్గర హడావుడి చేశాడు. అందరినీ నెట్టుకుంటూ ఏకంగా కోర్టులోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అక్కడ కాసేపు అలజడి చెలరేగింది. ఓ కేసు విషయంలో సుభాష్ చంద్రబోస్ అనే రౌడీషీటర్ ఈ రోజు హైకోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన అక్కడకు వచ్చాడు. అయితే, మరో కేసులోనూ నిందితుడిగా ఉన్న చంద్రబోస్.. పోలీసుల కళ్లుగప్పి నాలుగేళ్లుగా తిరుగుతున్నాడు. ఈ రోజు సదరు రౌడీషీటర్ హైకోర్టుకు హాజరవుతున్నాడన్న సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు అక్కడికి ముందే చేరుకొని బోస్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బోస్ తప్పించుకునేందుకు దురుసుగా ప్రవర్తిస్తూ కలకలం రేపాడు. ఎట్టకేలకు అతడిని పోలీసులు అరెస్టు చేశారు.