: వైకాపా ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి అరెస్ట్... ప్రొద్దుటూరులో ఉద్రిక్తత
ప్రొద్దుటూరుకు తాగు నీటిని అందించాలని కోరుతూ నిరసన చేపట్టిన వైకాపా ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డిని కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శివప్రసాద్ చేపట్టిన జలదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు, మునిసిపల్ అధికారులు ప్రయత్నించడంతో వైకాపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై కార్యకర్తలపై లాఠీలను ఝళిపించిన పోలీసులు, వారిని చెదరగొట్టి శివప్రసాదరెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, బలవంతంగా తీసుకెళ్లారు. తమ నేత అరెస్టును వ్యతిరేకిస్తూ, వైకాపా కార్యకర్తలు రహదారులను దిగ్బంధించి తన నిరసన కొనసాగిస్తున్నారు.