: ఒక్కొక్కరి చుట్టూ నలుగురు గూండాలు... ఎమ్మెల్యేలను చిత్ర హింసలు పెడుతున్నారు: పన్నీర్ సంచలన ఆరోపణ
"ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఒక్కో ఎమ్మెల్యే చుట్టూ కాపలాగా నలుగురు గూండాలు ఉన్నారట. వారు చుట్టూచేరి బాధ పెడుతున్నారట. కనీసం ఒక్క అడుగు కూడా అటూ ఇటూ వేయనీయడం లేదని శాసన సభ్యులు వాపోయారు" అని తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం వివరించారు. ఇక రాష్ట్రానికి హోం మినిస్టర్ గా కూడా ఉన్న పన్నీర్ సెల్వం, ఎందుకు గోల్డెన్ బే రిసార్టుపై పోలీసులతో దాడి చేయించడం లేదని మీడియా ప్రశ్నించగా, "రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితి నెలకొని వుంది. ఏ విధమైన పోలీసు చర్య తీసుకున్నా అనవసరంగా సమస్యలను సృష్టించినట్లవుతుంది. అందుకే నేను శాంతంగా ఉండి, ఓపికతో చూస్తున్నా" అన్నారు.
అమ్మ 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంటే, మేమంతా ఆసుపత్రి గేటు ముందు పగలు, రాత్రి వేచి చూశాము. శశికళ మాత్రమే అమ్మ దగ్గరకు వెళ్లి వచ్చేవారు. కనీసం ఒక్కనాడైనా ఆమె మీడియా ముందుకు వచ్చి అమ్మ ఆరోగ్యంపై మాట్లాడారా? అని పన్నీర్ ప్రశ్నించారు. కనీసం జయలలిత రక్తసంబంధీకురాలైన దీపను కూడా దగ్గరకు రానీయలేదని విమర్శించారు.