: ఎన్ని వేషాలు వేసినా అమ్మకు సమానమా?: పన్నీర్ సెల్వం
ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ ఎన్ని వేషాలు వేసినా అమ్మ జయలలితకు సమానం కాబోరని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. అమ్మ సినిమాల్లో కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని శశికళ అనుభవిస్తున్నారని ధ్వజమెత్తుతూ, ఆమె ఆస్తిలో చిల్లిగవ్వ కూడా శశికళకు దక్కనివ్వబోమని, అందుకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. తమ వర్గంలోకి 11 మంది ఎంపీలు వచ్చి చేరిన తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎవరినీ పిలవడం లేదని, వారే వచ్చి చేరుతున్నారని స్పష్టం చేశారు. ప్రజల్లో కనిపిస్తున్న రాజకీయ చైతన్యం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇంతటి చైతన్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. తనను సీఎంగా చేసి, ఆపై తీవ్రంగా అవమానించిన శశికళకు తగిన శాస్తి జరిగి తీరుతుందని అన్నారు.