: ఘాతకుడు వాడు... చంద్రబాబును చరిత్ర మరువదు: ఎన్టీఆర్ పాత వీడియోను చూపించిన దగ్గుబాటి
"నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే, తండ్రిలాంటి వాడిని, ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనుసులో ఆలోచించండని అడుగుతున్నాను. వాళ్లలో మానవత్వమైనా ఉంటుందేమోనని పరీక్షించాను. మానవులం కాదు మేము. పశువులం. నమ్మే వాళ్లకు ద్రోహం చేస్తాం. నమ్మిన వాళ్ల గొంతుకోస్తాం అని ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరువదు" అని దివంగత ఎన్టీఆర్ గతంలో వ్యాఖ్యానించిన మాటల వీడియోను ఆయన మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చూపారు. బాలకృష్ణ తీయదలచుకున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర చిత్రంలో చంద్రబాబునే విలన్ గా చూపాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు దగ్గుబాటి సమాధానం ఇస్తూ, ఈ వీడియోను చూపించి, ఎన్టీఆర్ మనసులో ఏముందో దీన్ని చూసి తెలుసుకోవాలని అన్నారు.