: పిల్లలు తల్లి పాదాలు కడిగి...పూజ చేసి ఆశీర్వాదం పొందాలి: సీఎం చంద్రబాబు
‘పిల్లలందరూ..తల్లి పాదాలు కడిగి...పూజ చేసి ఆశీర్వాదం పొందాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలల్లో ‘తల్లికి వందనం’ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లుల పాదాలు కడిగి, పూజ చేసి.. వారి ఆశీర్వాదం పొందాలని, తల్లికి గౌరవం లభించినప్పుడే మహిళలకు గౌరవం లభిస్తుందని అన్నారు. మహిళలకు గౌరవం కల్పించడం అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, మహిళలకు సాధికారత కల్పించడమంటే వారికి గౌరవం ఇవ్వడమేనని, మహిళలకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తే వారు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. సమాజంలో 50 శాతం మంది మహిళలకు గౌరవం దక్కట్లేదనే భావన ఉందని, ఆ భావనను రూపుమాపాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.