: ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది: పవన్ కల్యాణ్
హార్వార్డ్ వర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేళ, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో ఆసక్తికర అంశం గురించి ప్రస్తావించారు. తన తండ్రి విధుల్లో భాగంగా రెండేళ్లకోసారి బదిలీ అయి వేరే చోటికి వెళుతుంటే, ప్రతి ఊరిలో తమను వేరే వాళ్లుగా చూసేవారని చెప్పుకొచ్చారు.
"నేను ఏడో తరగతిలో ఉన్న సమయంలో ఓ ఘటన జరిగింది. మా అక్కయ్యకు 16, 17 ఏళ్ల వయసుంటుందప్పుడు. డాన్స్ స్కూలుకు వెళ్లిన తను ఏడుస్తూ ఇంటికి వచ్చింది. వచ్చే దారిలో ఎవడో పోకిరి తన చెయ్యి పట్టుకుని వేధించాడు. ఆ దృశ్యాన్ని ఎంతో మంది చూశారు. ఎవ్వరూ స్పందించలేదు. చివరికి ఆమె ఏడుస్తూ, తప్పించుకుని ఇంటికి వచ్చేసింది. విషయం తెలిసిన నాకు ఆ దుర్మార్గుడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అలాంటి వాళ్లు ప్రతి చోటా ఉంటారు. నా ఆవేదనంతా ఒక్కటే. చుట్టూ ఉన్నవాళ్లు ఎందుకు స్పందించలేదన్నదే.
అవినీతి సమాజం, అవినీతి రాజకీయాల వల్లనే ఇలా జరుగుతోందని తెలుసుకున్నాను. ప్రలోభపెట్టేవారికి చట్టాలు అనుకూలంగా పనిచేయడం దురదృష్టకరం. మన సమాజం మారాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన విధానం కూడా నన్ను అంతే బాధించింది. 17 సంవత్సరాల పాటు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి, ఆపై అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. సరైన విధానం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా విభజించారు. ఇండియాలో ఒకే భాష మాట్లాడుతున్న తెలుగువారిని విభజన పేరిట దూరం చేశారు. అంతరాలు పెంచారు. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ఈ పరిణామం బాధించింది. ఏం చేయాలో తెలియలేదు. ఆపై మిత్రులతో చర్చించిన మీదటే రాజకీయాల్లోకి వచ్చాను. ఆపై ఏం జరుగుతూ ఉందో మీ కందరికీ తెలిసిందే" అని పవన్ చెప్పుకొచ్చారు.