: శశికళ అక్రమాస్తులపై రేపు తీర్పు లేనట్టే.. కేసుల జాబితాలో చేర్చని సుప్రీం
శశికళ అక్రమాస్తులపై రేపు(సోమవారం) తీర్పు వచ్చే సూచనలు కనిపించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శశికళ భవితవ్యం సుప్రీంకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. సోమవారం రోజు కేసుల జాబితాలో శశికళ అక్రమాస్తుల కేసును సుప్రీంకోర్టు చేర్చకపోవడంతో రేపు తీర్పు వెలువడే అవకాశం కనిపించడం లేదు. వారం రోజుల్లోనే ఈ కేసులో తీర్పు ఉంటుందని జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం చెప్పడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రేపటి కేసుల్లో సుప్రీం దీనిని చేర్చలేదు. మరోవైపు శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈనెల 17న న్యాయస్థానం చేపట్టనుంది.