: శశికళ చేసిన ఆ మూడు తప్పులే కొంప ముంచాయా?
ఎటువంటి కష్టం లేకుండా సీఎం పీఠాన్ని ఎక్కేయవచ్చని భావించిన శశికళ ప్లాన్ ఎందుకు తిరగబడింది? వ్యవహారం రోజురోజుకు కొరకరాని కొయ్యలా ఎందుకు మారుతోంది? శశికళ స్వయం కృతాపరాధమే దీనంతటికీ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. జయ సమాధి వద్ద మౌనం పాటించి, రెండు నిమిషాలు మాట్లాడిన పన్నీర్ సెల్వం శశికళ ఆశలను సమూలంగా తుడిచిపెట్టేశారు. 33 ఏళ్లపాటు పెంచుకున్న ఆశలను ఒక్క మాటతో కుప్పకూల్చారు. ‘దూకుడు’, ‘వ్యూహం లేకపోవడం’, ‘రహస్యం’.. ఆమె అనుసరించిన ఈ మూడు విధానాలే ఆమె కొంపను కొల్లేరు చేశాయని శశికళను నిశితంగా గమనించినవారు చెబుతున్నారు.
శశికళ జీవితంలో తొలి నుంచీ పారదర్శకత లేకపోవడమే ఆమె తొలి తప్పు. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె ప్రాణాలు విడిచేంత వరకు అంతా రహస్యంగా జరిగింది. ‘అమ్మ’ అనారోగ్యం గురించి కానీ, వైద్యులు ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క విషయం బయటకు రాలేదు. కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని శశికళే దగ్గరుండి నడిపారు. పార్టీ తరపున కానీ, జయ తరపున కానీ ఆమె అనారోగ్యంపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. జయ మృతిపై సాక్షాత్తూ న్యాయమూర్తులే అనుమానం వ్యక్తం చేయడానికి గల కారణం కూడా ఆమె వైఖరే.
సహనం కోల్పోవడం శశికళ చేసిన రెండో తప్పు. రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి, ఉన్నవారికి ఇది ఎంతో ముఖ్యం. ఎంతో ముఖ్యమైనదే శశికళకు లేకపోయింది. గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు కూడా ఆమె సహనంగా ఉండలేకపోయారు. జయలలితలా చీరకట్టుకుని, ముడివేసుకుంటేనే జయలలిత అయిపోతానని భావించి తప్పులో కాలేశారు.
శశికళ మూడో తప్పు వ్యూహం లేకపోవడం. పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే సీఎం పీఠంపై కన్నేశారు. జయ మరణానికి కొన్ని గంటల ముందే ఎమ్మెల్యేలతో తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నారు. ‘చిన్నమ్మే’ సీఎం అంటూ అనుచరులతో లేఖ కూడా రాయించుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేకుండా దూసుకెళ్లడం ఆమె చేసిన అతిపెద్ద తప్పు. పన్నీర్‌తో రాజీనామా చేయిస్తే సీఎం పీఠాన్ని ఎక్కేయవచ్చని భావించారు తప్పితే, అది పార్టీలో చీలికకు కారణమైతే ఏం చేయాలనే దానిపై సరైన వ్యూహాన్ని రచించలేకపోయారు. ప్రతిపక్షం, కేంద్రం కూడా పన్నీర్ వైపే ఉన్నారని తెలిసినా తెగే వరకు లాగాలని ప్రయత్నించి శశికళ మరో తప్పు చేశారు.