: రోజాను కిడ్నాప్ చేశారు.. ఆమె ఎక్కడుందో చెప్పాలి: వైసీపీ నాయకురాలు ఈశ్వరి ఆగ్రహం
మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్పోర్టుకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను కిడ్నాప్ చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలను అవమాన పరుస్తున్నారని ఆమె అన్నారు. పోలీసులు తమ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. ఆర్కే రోజాను నిర్బంధించడం భావ్యమేనా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు బ్లాక్ డే అని ఆమె వ్యాఖ్యానించారు. అమరావతి ప్రతిష్టను నలుదిశలా చాటి చెబుతామని చెప్పుకుంటూ మరోవైపు ఓ మహిళా నేతను నిర్బంధించారని ఆమె అన్నారు. రోజా ఎక్కడ ఉన్నారో చెప్పాలని, త్వరగా విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకే ఇంతటి అవమానకర పరిస్థితులు ఎదురవుతుంటే సాధారణ మహిళలకు ఎలా రక్షణ దొరుకుతుందని అన్నారు. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.