: అన్నాడీఎంకే ఎమ్మెల్యేల నిర్బంధంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు
తమిళనాట నిమిషానికో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటోంది. సీఎం పీఠంపై కన్నేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను రిసార్ట్ లకు తరలించి ఎటూ వెళ్లకుండా ఏర్పాట్లు చేయగా... దీనిపై మద్రాస్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఎమ్మేల్యేలను శశికళ నిర్బంధించినట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్వీర్ సెల్వం ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే.
90 మంది ఎమ్మెల్యేలను మహాబలిపురం సమీపంలోని కూవత్తూర్ వద్ద ఓ రిసార్ట్ లో ఉంచగా, మరో 30 మంది ఎమ్మెల్యేలను కల్పక్కం సమీపంలో ఓ రిసార్ట్ వద్ద నిర్బంధించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను ఫోన్లు వాడేందుకు, టీవీలు చూసేందుకు సైతం అనుమతించడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. బయటకు మాత్రం ఎమ్మెల్యేలు వారంతట వారే ఫోన్లను స్విచాఫ్ చేసినట్టు శశికళ వర్గం బుకాయిస్తోంది. కాగా, ఎమ్మెల్యేల విడుదలకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎమ్మెల్యే వీసీ ఆరుకుట్టి తాజాగా డిమాండ్ చేశారు.