: చైనా అధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడి ఫోన్ మంతనాలు... ఏక చైనా విధానానికి జై
ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాకు స్నేహహస్తం అందించారు. అమెరికా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో గురువారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ఏక చైనా విధానాన్ని గౌరవించేందుకు ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నుంచి ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా కఠిన పదజాలంతో వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే తైవాన్ నేతతో ట్రంప్ మంతనాలు జరపడం చైనాకు కోపం తెప్పించింది. తైవాన్ చైనాలో భాగమన్న విషయం విదితమే. దీంతో ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలంటూ డ్రాగన్ ట్రంప్ కు గట్టిగానే స్పష్టం చేసింది.
ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ట్రంప్, జిన్ పింగ్ తాజా సంభాషణలతో చల్లబడనున్నాయి. జపాన్ ప్రధాని షింజో అబేకు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ సంభాషణ జరగడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. సున్నితమైన అంశాలపై సుదీర్ఘమైన సంప్రదింపులు జరిగినట్టు వైట్ హౌస్ వెల్లడించింది. ఒకే చైనా విధానాన్ని గౌరవించాలని జిన్ పింగ్ కోరిన మీదట అందుకు ట్రంప్ అంగీకరించినట్టు కూడా తెలిపింది. ట్రంప్ సుముఖతకు జిన్ పింగ్ అభినందనలు తెలిపినట్టు చైనా మీడియా పేర్కొంది.