: శశికళ ఇచ్చిన ఎమ్మెల్యేల సంతకాలు సరైనవేనా? లేక ఫోర్జరీనా?: గవర్నర్ అనుమానం
నిన్న సాయంత్రం తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావును కలసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ... తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ వారి సంతకాలను గవర్నర్ కు సమర్పించారు. ఈ సందర్భంగా దాదాపు అరగంట పాటు తన వాదన వినిపించిన శశికళ... పది అంశాలతో కూడిన ప్రజెంటేషన్ ను విద్యాసాగర్ రావుకు ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా తనను శాసనసభాపక్ష నేతగా ఎలా ఎన్నుకున్నారో గవర్నర్ కు ఆమె వివరించారు. మరోవైపు, ఎమ్మెల్యేలతో ఖాళీ పేపర్లపై శశికళ సంతకాలు చేయించుకున్నారని... ఆ పేపర్ పై వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని పన్నీర్ సెల్వం ఆరోపించారు. శశికళ చెబుతున్న ఎమ్మెల్యేల సంతకాల్లో ఫోర్జరీ సంతకాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో, ఈ విషయంపై విద్యాసాగర్ రావు కూడా సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం. శశికళ సమర్పించిన సంతకాలన్నింటినీ సరిచూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంతకాలు నిజమైనవా? లేక ఫోర్జరీనా? అనే విషయం తేల్చడానికి వాటిని ఫోరెన్సిక్ నిపుణుల వద్దకు కూడా పంపాలనే యోచనలో ఆయన ఉన్నారు. మరోవైపు తన మద్దతును నిరూపించుకోవడానికి ఐదు రోజుల సమయం ఇవ్వాలని పన్నీర్ సెల్వం గవర్నర్ ను కోరారు.