: ఎమ్మెల్యేలను కదలనివ్వని శశికళ.. రిసార్ట్స్ లో బందీలుగా మారిన వైనం!
ఊహించని విధంగా మిస్టర్ కూల్ సీఎం పన్నీర్ సెల్వం మూడో కన్ను తెరవడంతో... సీఎం కావాలనుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఆశలు ఆవిరైపోయాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి తనకు ఎలాంటి ఆటంకాలు లేవన్న ధీమాతో ఉన్న ఆమెకు... పన్నీర్ షాకుల మీద షాకులు ఇచ్చారు. దీంతో, తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఆమెకు దాపురించాయి. ఇప్పటికే ఆమె చెంత ఉన్న పలువురు ఎమ్మెల్యేలను పన్నీర్ లాగేసుకోవడంతో, సీఎం కావడానికి అవసరమైన మెజార్టీని ఆమె సాధించడం దాదాపు కష్టసాధ్యమనే చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో, తన వద్ద ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రిసార్ట్స్ లో ఉన్న వారిని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలడం లేదు. వారి సెల్ ఫోన్లను కూడా తీసేసుకున్నట్టు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యే జారుకునే కొద్దీ, తమ అవకాశాలు సన్నగిల్లుతాయనే విషయం శశి వర్గానికి బాగా తెలుసు. తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు తుది నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజులు పట్టవచ్చన్న అంచనాల నేపథ్యంలో, శశి వర్గీయులు తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలు జంప్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, శశి క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక రకంగా చెప్పాలంటే... హౌస్ అరెస్ట్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.