: భారత ఆర్మీ సర్జికల్ దాడులు ఎలా చేసిందంటే.. ఆంగ్ల పత్రిక ఆసక్తికర కథనం
సర్జికల్ దాడులు.. పాక్ వెన్నులో వణుకుపుట్టించేలా భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటి వరకు గోప్యంగానే మిగిలిపోయాయి. మెరుపు దాడుల్లో పాల్గొన్న 19 మంది వీర సైనికుల వివరాలను ప్రభుత్వం అప్పట్లో రహస్యంగా ఉంచింది. అయితే తాజాగా భారత ఆర్మీని ఉంటంకిస్తూ ఆంగ్ల పత్రిక ఒకటి సర్జికల్ దాడులు జరిగిన తీరును వివరించింది. ఆ పత్రిక కథనం ప్రకారం..
సర్జికల్ స్ట్రయిక్స్‌లో పారా రెజిమెంట్‌లోని 4, 9 బెటాలియన్లకు చెందిన కల్నల్, ఐదుగురు మేజర్లు, ఇద్దరు కెప్టెన్లు, సుబేదార్, ఇద్దరు నాయిబ్ సుబేదార్లు, లాన్స్ నాయక్, ముగ్గురు హవల్దార్లు, నలుగురు పారా ట్రూపర్లు పాల్గొన్నారు. గతేడాది సెప్టెంబరు 28న అర్ధరాత్రి దాటాక మేజర్ రోహిత్ సూరి నేతృత్వంలో 8 మందితో కూడిన సైట్రెక్ బృందానికి దాడులకు అనుమతి ఇచ్చారు. సూరి నేతృత్వంలోని బృందం లక్ష్యానికి 50 మీటర్ల దగ్గరకు చొచ్చుకెళ్లి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఆ సమీపంలోనే కనిపించిన ఇద్దరు జిహాదీలను డ్రోన్ల సాయంతో ట్రాక్ చేసి వారినీ హతమార్చారు.
అంతకుముందు రోజు అంటే సెప్టెంబరు 27న మరో మేజర్ తన బృందంతో నియంత్రణ రేఖ దాటి వెళ్లి లక్ష్యాలపై నిఘా వేసి కాల్పులు ఎక్కడ జరపాలో ప్రణాళిక సిద్ధం చేశారు. ప్లాన్ ప్రకారం ఇద్దరు ఉగ్రవాదులను చంపిన మేజర్ వారి ఆయుధాగారాన్ని ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన జిహాదీలు జవాన్లపై కాల్పులు ప్రారంభించడంతో మేజర్ ఒక్కరే నేలపై పాక్కుంటూ వెళ్లి మరో ఉగ్రవాదిని కాల్చి చంపారు. మరో మేజర్ తన బృందంతో కలిసి ఉగ్రవాదులకు చెందిన మరో శిబిరాన్ని ధ్వంసం చేశారు. నాలుగో మేజర్ గ్రెనేడ్ దాడులతో ఉగ్రవాదులను పరుగులు పెట్టించారు. ఐదో మేజర్ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టగా ఆయన బృందంలోని జవాను మరో ఉగ్రవాదిని కాల్చి చంపాడు. ఇలా బృందంలోని మేజర్లు, సుబేదార్లు, పారాట్రూపర్లు.. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు.
సర్జికల్ స్ట్రయిక్స్‌ను భారత ఆర్మీ విజయవంతంగా పూర్తి చేసింది. సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఓ పారాట్రూపర్ మందుపాతరపై కాలువేయడంతో అది పేలి కుడికాలు కొంత దెబ్బతింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మేజర్ సూరిని ప్రభుత్వం రిపబ్లిక్ డే నాడు కీర్తి చక్ర అవార్డుతో సత్కరించగా, కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ హర్‌ప్రీత్ సంధును యుద్ధసేవా మెడల్‌తో సత్కరించింది. మెరుపుదాడుల్లో పాలుపంచుకున్న మిగతా సభ్యులను కూడా ప్రభుత్వం నాలుగు శౌర్యచక్ర పురస్కారాలు, 13 సేవా పతకాలతో సత్కరించినట్టు పత్రిక తన కథనంలో వివరించింది.