: పన్నీర్ సెల్వంకు కలిసొచ్చిన సీఎం హోదా... శశికళకు సులువుగా చెక్!


తమిళనాడుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండటం పన్నీర్ సెల్వంకు కలిసొచ్చింది. ఇప్పటికే శశికళకు చెక్ చెప్పాలని అనుకున్న ఆయన, సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పన్నీర్ దూకుడు పెంచిన వేళ, ఏం చేయాలో పాలుపోని స్థితిలో శశికళ వర్గం ఉన్నట్టు తమిళనాడు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తనకున్న హోదాతో జయలలిత మృతిపై విచారణ జరిపిస్తానని, ఆమె నివాసాన్ని మెమోరియల్ హాలుగా మారుస్తానని చెప్పి ఈ ఉదయం శశికళ వర్గానికి షాకిచ్చిన ఆయన, ఆపై శరవేగంగా పావులు కదిపారు.

డీజీపీ, సీఎస్ లతో సమావేశమై రహస్యంగా శశికళ దాచివుంచిన ఎమ్మెల్యేలను తక్షణం బయటకు తేవాలని ఆదేశాలివ్వడం కూడా ఆయన ఎత్తులో భాగమే. ఆపై నిన్నటి నుంచి క్యాంపు రాజకీయాల్లో భాగమైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తుంటే ఆయన శిబిరం ఆనందంలో మునిగిపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా తనకున్న సీఎం హోదాతో, గవర్నర్ కు స్వాగతం పలికే వంక పెట్టుకుని విమానాశ్రయానికి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో, విద్యాసాగర్ రావుతో తొలుత మాట్లాడే అవకాశం ఆయనదేనని స్పష్టమైపోయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించి, అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశాన్ని తనకు ఇవ్వాలని పన్నీర్ కోరనున్నట్టు తెలుస్తోంది.

సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి, తొలుత అవకాశం కూడా ఆయనకే లభిస్తుందని కొందరు, రాజీనామా చేశారు కాబట్టి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని గవర్నర్ భావిస్తే, శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన శశికళకు తొలుత అవకాశాన్ని గవర్నర్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మరికొందరు భావిస్తున్నారు. విద్యాసాగర్ మాత్రం ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాతనే ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

  • Loading...

More Telugu News