: శశికళ వర్గం నుంచి తప్పించుకుంటున్న ఎమ్మెల్యేలు... ఇప్పటివరకూ హ్యాండిచ్చింది 43 మంది!
నిన్న మధ్యాహ్నం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశాన్ని శశికళా నటరాజన్ నిర్వహించిన వేళ, సుమారు 120 నుంచి 130 మంది వరకూ ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతు పలికేందుకు తరలివచ్చారు. ఎమ్మెల్యేల సంఖ్యపై కచ్చితమైన స్పష్టత లేనప్పటికీ, 125 మందికి పైగానే ఎమ్మెల్యేలు శశి వెంట ఉన్నారని, వారందరినీ రహస్యంగా శిబిరాలకు తరలించారని వార్తలు వచ్చాయి. ఇక బస్సులు ఎక్కి, వివిధ రిసార్టులు, హోటళ్లకు చేరిన ఎమ్మెల్యేల్లో 43 మంది వరకూ చెప్పా పెట్టకుండా పారిపోయినట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. బాత్ రూంకు వెళ్లి వస్తానని ఒకరు, సిగరెట్ ప్యాకెట్ తెచ్చుకుంటానని మరొకరు, అత్యవసర పని చూసుకుని, కాసేపట్లో వస్తానని ఇంకొకరు... ఇలా ఆమె శిబిరాన్ని వీడి చాలా మంది వెళ్లిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 117 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఆమె వద్ద ఇప్పుడు 80 నుంచి 90 మంది మాత్రమే ఉండవచ్చని తెలుస్తోంది.