: పన్నీర్ సెల్వం వెనుక.. ఆ ఐదుగురు!
తమిళ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. ఎలాగైనా సీఎం పీఠంపై కూర్చోవాలని శశికళ... ఎట్టి పరిస్థితుల్లో అది జరగకూడదని పన్నీర్ సెల్వం... అనధికారికంగా పన్నీర్ కు అండగా ఉన్న స్టాలిన్... ఇలా ఎన్నో రకాల ఎత్తుగడలు చెన్నైలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ముంబై నుంచి చెన్నై బయలుదేరారు. దీంతో, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ సర్వత్రా కొనసాగుతోంది.
మరోవైపు, మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న పన్నీర్ సెల్వం... ఇప్పుడు తూటాల్లాంటి మాటలతో శశికళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
ఆయన వెనక ఉన్న ఐదుగురు రాజకీయ యోధులు... ఆయనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. వారెవరంటే... మాజీ స్పీకర్, అన్నాడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండ్యన్, మాజీ మంత్రులు సి.అరంగనాయకమ్, ఆర్.విశ్వనాథన్, కేపీ మునుస్వామి, రాజ్యసభ ఎంపీ మైత్రేయన్. వీరంతా శశికళకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. మరోవైపు 40 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ దొరకడం లేదనే వార్త తమిళనాట మరింత ఉత్కంఠను పెంచింది. వీరంతా పన్నీర్ కు మద్దతు ప్రకటించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పన్నీర్ కూడా తనకు భారీ సంఖ్యలోనే ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, మధ్యాహ్నం తర్వాత చెన్నైలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.