: ఇన్ఫోసిస్ లో తుపాను... సిక్కాకు వ్యతిరేకంగా లేఖ రాసిన ఎన్ఆర్, క్రిస్, నందన్
టాటా గ్రూప్ లో జరిగిన తరహాలోనే ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ లోనూ సీఈఓకు వ్యతిరేకంగా వ్యవస్థాపకులు కదిలారు. ఇన్ఫీకి సీఈఓగా ఉన్న విశాల్ సిక్కా వేతనాన్ని భారీగా పెంచడంపై సంస్థ ఫౌండర్ సభ్యులైన ఎన్ఆర్ నారాయణమూర్తి, క్రిస్ గోపాలకృష్ణన్, నందన్ నిలేకని లు ఆగ్రహంతో డైరెక్టర్ల బోర్డుకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. సిక్కాతో పాటు సంస్థకు రాజీనామా చేసిన ఇద్దరు ఉన్నతోద్యోగులకు భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వటాన్ని కూడా వారు తప్పుబట్టినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే వ్యాపార వాతావరణం సరిగ్గా లేక ఆదాయం పెంచుకోవడంలో ఇబ్బందులు పడుతున్న సంస్థలో ఈ తాజా లేఖతో కలకలం మొదలైంది. సంస్థ దీనిపై వివరణ ఇస్తూ, బోర్డు డైరెక్టర్ల అభిప్రాయాల మేరకే కంపెనీ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించినా, 12.75 శాతం వాటా ఉన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు రాసిన లేఖ ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014, ఆగస్టు 1న ఎస్డీ శిబూలాల్ నుంచి సిక్కాకు పగ్గాలు దక్కగా, ఇటీవల ఆయన సాలీన వేతనాన్ని రూ. 74 కోట్లకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇక సంస్థ నుంచి వైదొలగిన బన్సల్ వేతనం రూ. 4.72 కోట్లు కాగా, వీడ్కోలు ప్యాకేజీగా రూ. 23.02 కోట్లను ఇచ్చారు. జనరల్ కౌన్సిల్ సేవలందించిన డేవిడ్ కెన్నడీ రాజీనామా చేసినప్పుడు రూ. 5.85 కోట్లను ఇచ్చి పంపింది. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది.
ఇక మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ సైతం ఫౌండర్లు రాసిన లేఖపై మద్దతు పలుకుతూ, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం కంపెనీ ప్రయోజనాలు అన్న ఒక్క చిన్న మాట సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతవరకూ ఇండియాలోని ఏ కంపెనీ కూడా ఇంత భారీగా వీడ్కోలు ప్యాకేజీ ఇవ్వలేదని, వెళ్లిపోయేవారికి 24 నెలల బేసిక్ వేతనం ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.