: రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయం.. శశికళకు గవర్నర్ అపాయింట్ మెంట్!


అనిశ్చితి రాజ్యమేలుతున్న తమిళనాడులో ప్రస్తుత రాజకీయాలు రాజ్‌భవన్ చుట్టూ తిరుగుతున్నాయి. శాసనసభాపక్ష నేతగా ఎన్నికై సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం ఎదురుచూస్తున్న శశికళకు గవర్నర్ షాకివ్వడంతో కంగుతిన్న శశకళ నేడు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఇదే సమయంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై వస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తనను కలిసేందుకు శశికళ, ఆమెకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కలిసేందుకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో గవర్నర్ తీరుపై ఢిల్లీ వెళ్లి పెద్దలకు ఫిర్యాదు చేయాలనుకున్న శశికళ ఇప్పుడు మనసు మార్చుకున్నారు.

మరోవైపు బుధవారం నుంచి క్యాంపులు నిర్వహిస్తూ శశికళలో గుబులు పుట్టించిన పన్నీర్ సెల్వం తమిళనాడుకు ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని ప్రకటించుకున్నారు. బలనిరూపణకు సిద్ధమని పేర్కొన్నారు. అదే సమయంలో శశికళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. దీనికి సీనియర్ నేతలు సహా 129 మంది ఎమ్మెల్యేలు హాజరుకావడంతో ఖుషీ అయిపోయారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఓ హోటల్‌కు తరలించి క్యాంపు ఏర్పాటు చేశారు. ఇక శశికళపై గుర్రుగా ఉన్న ఆమె వ్యతిరేకులంతా ఏకతాటిపైకి వస్తూ పన్నీర్‌కు మద్దతు తెలుపుతున్నారు. అవసరమైతే ఆయనకు మద్దతు ఇచ్చేందుకు డీఎంకే, కాంగ్రెస్‌లు కూడా సిద్ధంగా ఉండడంతో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. దీంతో ఇప్పుడందరి దృష్టి గవర్నర్‌పైనే ఉంది. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News