: నమ్మక ద్రోహి పన్నీర్ సెల్వంకు తగిన బుద్ధి చెబుతాం: శశికళ
తమపై తిరుగుబాటు చేస్తోన్న తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని పేర్కొన్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్.. ఆయనకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసిన అనంతరం శశికళ మీడియాతో మాట్లాడుతూ... తమ వ్యతిరేకులు తమ వెనుక గోతులు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. అమ్మ చనిపోయిన విషాద సమయంలో తాను పార్టీ పగ్గాలు చేపట్టబోనని ముందు చెప్పానని శశికళ చెప్పారు. ఆ తర్వాత జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టక తప్పలేదని వ్యాఖ్యానించారు. జయలలిత జీవితకాలం పోరాటం చేసిన డీఎంకేతో పన్నీర్ సెల్వం చేతులు కలిపడం శోచనీయమని ఆమె చెప్పారు.