: శశికళ వెనుక అంత బలం లేదు... అందరూ 'గో.పి'లే!


తమిళనాడులో సాగుతున్న అన్నాడీఎంకే నంబర్ గేమ్ లో ప్రస్తుతానికి శశికళ ముందున్నట్టు కనిపిస్తున్నా, పన్నీర్ సెల్వం ఎత్తులను తక్కువగా అంచనా వేసేందుకు వీల్లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉదయం అన్నాడీఎంకే పార్టీ సమావేశానికి 120 నుంచి 130 మంది వరకూ ఎమ్మెల్యేలు హాజరై, శశికళకు మద్దతు తెలిపినప్పటికీ, వీరంతా కడవరకూ ఆమె వెంటే ఉంటారని చెప్పలేమని అంటున్నారు. వచ్చే వారంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూసే ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నారని, చీలిక ఏర్పడి రాష్ట్రపతి పాలన, లేదా ప్రభుత్వం రద్దు వంటి పరిస్థితి ఏర్పడితే, తిరిగి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఎవరూ లేరని, ఈ కారణంతోనే ప్రస్తుతానికి శశికళ తమ నేతని వారు చెబుతున్నారని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు నిందితురాలిగా ఉన్న శశికళ తప్పు చేసినట్టు తీర్పు వస్తే, ఈ కేసులో భారత చట్టాలను అనుసరించి కచ్చితంగా రెండేళ్లకు మించిన శిక్షే పడుతుంది. అంటే, ఆమె తప్పు చేసిందని సుప్రీం తీర్పు వ్యాఖ్యానించిన పక్షంలో, శిక్షను ఖరారు చేసేందుకు మరికొంత సమయం తీసుకున్నా, సీఎం అవకాశం ఆమెకు దక్కదనే అర్థం చేసుకోవాలి. రెండేళ్లకు మించి శిక్షపడ్డ వారు, ఆరేళ్ల పాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం ఉన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

అదే జరిగితే సీఎం పదవిని అధిష్టించాలన్న శశికళ ఆశ అడియాసే అవుతుంది. శశికళ జైలుకు వెళితే, ఆపై పార్టీని చెప్పుచేతల్లో ఉంచుకునే నేత మరొకరు పార్టీలో లేరన్నది అందరికీ తెలిసిన సత్యం. అప్పుడిక ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వమే దిక్కు. ఇప్పటికే తమిళ ప్రజల్లో పన్నీర్ సెల్వానికి మంచి గుర్తింపు, సానుభూతి మెండుగా ఉన్నాయి. అప్పుడే పన్నీర్ వెంట ఎమ్మెల్యేలు నడుస్తారని, అప్పటివరకూ 'గోడమీది పిల్లుల్లా' (గోపి) వ్యవహరిస్తారని నిపుణులు భావిస్తున్నారు.

అందువల్లే గవర్నర్ విద్యాసాగర్ రావు సైతం, శశికళను శాసనసభా పక్ష నేతగా ఎన్నకోగానే చెన్నై వచ్చి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు వెనుకంజ వేశారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వరకూ వేచి చూసి, ఆపై ఓ నిర్ణయం తీసుకోవాలని అటార్నీ జనరల్ ఆయనకు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆయన ముందు మరో సమస్య కూడా ఉంది. అది నేటి అన్నాడీఎంకే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేల సంఖ్య. అత్యధిక ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్న నేపథ్యంలో, వారు ఒత్తిడి చేస్తే, వెంటనే చెన్నై చేరుకుని, సీఎంగా శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకుంటే, మరో రాజ్యాంగ సంక్షోభానికి గవర్నర్ కారణమవుతారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లే భారతావనిలో కలకలం రేపిన తమిళరాజకీయాలు ఎక్కడి వరకూ వెళ్లి ఆగుతాయో వేచి చూడాలి!

  • Loading...

More Telugu News