: రాజ్యాంగ పరంగా మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాను: జయలలిత మేనకోడలు దీప
తమిళనాడులో అస్థిరత ఏర్పడిందని, దీంతో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆవేదన చెందుతున్నారని దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... శశికళ నటరాజన్‌కు సీఎం అయ్యే అర్హత లేదని ఆమె అన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పారు. ప్రజలు శశికళ నటరాజన్‌కు ఓటు వేయలేదని, ఆమె సీఎం ఎలా అవుతారని దీప ప్రశ్నించారు.
రాజ్యాంగ పరంగా మళ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో జయలలితను కలిసేందుకు తనను అనుమతించలేదని, జయ మృతిపై తనకు అనుమానాలున్నాయని చెప్పారు. ఆమె మృతిపై అపోలో వైద్యులు ఇచ్చిన సమాధానం సరిపోదని చెప్పారు. జయలలితకు చికిత్స అందించిన రిపోర్టులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.