: హోదా వస్తే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.. రాకపోయినా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి: బాలకృష్ణ
హిందూపురంలోని పరిస్థితులపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించానని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. ఈ రోజు ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఎన్టీఆర్ రక్తం తనలో ప్రవహిస్తోందని, ప్రజల సేవే తనకు ముఖ్యమని, తాను రాజకీయాలు, సినిమాలు, బసవతారకం ఆసుపత్రి వంటి ఎన్నో బాధ్యతలు చూసుకోవాల్సి ఉందని చెప్పారు. నాన్నగారు నేర్పిన క్రమశిక్షణతో తనదైన శైలిలో తాను నడుచుకుంటున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై బాలయ్య స్పందిస్తూ... ఆంధ్రకు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అని, అభివృద్ధి సంగతిని ఆయన చూసుకుంటారని చెప్పారు. హోదా వస్తే కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని, రాకపోయినా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రానికీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించారని బాలయ్య అన్నారు. ఇప్పుడు ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు.