: వందల కోట్ల పెట్టుబడులతో నేపాల్ కు మరింత దగ్గరవుతున్న చైనా... చేష్టలుడిగి చూస్తున్న భారత్!
ఇండియాను ఎదుర్కోవాలంటే, పొరుగున ఉన్న పాకిస్థాన్, నేపాల్ దేశాలకు దగ్గర కావాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా, వందల కోట్ల రూపాయలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో పెడుతూ ఉంటే భారత్ చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. హిమాలయా రీజియన్ ప్రాంతంలో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చైనా ఈ ఆర్థిక సంవత్సరంలో 51.77 మిలియన్ డాలర్ల పెట్టుబడులను నేపాల్ లో పెట్టింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 76.39 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐని అందించేందుకు అంగీకరించిన చైనా, తొలి ఆరు నెలల కాలంలోనే భారీ మొత్తాన్ని అందించినట్టు తెలుస్తోంది.
2015-16లో నేపాల్ లో 57 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐతో చైనా తొలి స్థానంలో నిలువగా, కేవలం 18 మిలియన్ డాలర్లకు పరిమితమైన ఇండియా మూడవ స్థానంతో సరిపెట్టుకుందని చైనా అధికార న్యూస్ ఏజన్సీ క్సిన్హువా ఓ నివేదికలో తెలిపింది. కాగా, నేపాల్ కు చైనా దగ్గరవుతుండటం భారత్ కు ఇబ్బందికర అంశమేనని, ఇప్పటికే ఎకనామిక్ కారిడార్ లో భారీ పెట్టుబడి పెట్టడం ద్వారా పాక్ కు ఆ దేశం దగ్గరైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.