: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. భారీగా మావోయిస్టుల మృతి.. కొనసాగుతున్న కాల్పులు
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. నారాయణపూర్ జిల్లాలోని అకాబీడా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఎస్‌పీ అభిషేక్ మీనా చెబుతున్నారు. ఆ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడడంతోనే తాము కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. మరోవైపు అకాబీడా ప్రాంతంలో జరుగుతున్న మావోయిస్టుల సమావేశం నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగాయని పలువురు పేర్కొంటున్నారు. ఆ సమావేశం గురించి సమాచారం అందుకున్న బలగాలు ఈ కాల్పులు జరిపాయని చెబుతున్నారు.
ఈ సమావేశంలో దాదాపు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరికొంతమంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగానే ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.