: స్పందించిన బాలయ్య.. పీఏ శేఖర్‌పై వేటు.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక!


తన వ్యక్తిగత సహాయకుడు చంద్రశేఖర్ నాయుడు(శేఖర్)పై వస్తున్న వార్తలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. షాడో ఎమ్మెల్యేగా మారి నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తున్న అతడిపై బాలయ్య వేటేసినట్టు తెలిసింది. రెండున్నరేళ్లుగా బాలకృష్ణకు పీఏగా ఉన్న శేఖర్, పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడు, సీనియర్ నేత అంబికా లక్ష్మీనారాయణ వంటి వారిని సైతం ఖాతరు చేసేవారు కాదనే విమర్శలు ఉన్నాయి. బాలకృష్ణ మూడు నెలలకు ఓసారి నియోజకవర్గానికి రావడం, ఉన్న రెండు మూడు రోజులు ఊపిరి సలపని కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో శేఖర్ చెలరేగిపోయినట్టు చెబుతున్నారు.
 
 పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన శేఖర్ చిలమత్తూరు మండలంలో కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించడం, లక్ష రూపాయల పనికి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు శేఖర్‌పై ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయన ఆగడాలు భరించలేని పార్టీ కార్యకర్తలు వెంకట్రాముడుతో మొరపెట్టుకున్నారు. ఆయన రంగంలోకి దిగినా శేఖర్ ప్రవర్తన మారకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా గళమెత్తారు. మరోవైపు శేఖర్ తన అనుచరులతో కలిసి లేపాక్షిలో ర్యాలీ కూడా నిర్వహించారు.

పార్టీ‌లో విభేదాలు భగ్గుమనడంతో శేఖర్ వ్యవహారం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. దీనికితోడు శేఖర్ తీరుపై పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవడంతో స్పందించిన బాలయ్య తన వేగుల ద్వారా సమాచారం తెప్పించుకున్నట్టు తెలిసింది. శేఖర్ గురించి  పూర్తిగా తెలుసుకున్న ఆయన అతనిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. గ్రూపులను తాను సహించబోనని, పార్టీకి ఎవరైనా ఒకటేనని, తానైనా, నాయకులైనా, కార్యకర్తలైనా సమానమేనని బాలకృష్ణ పేర్కొన్నట్టు తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్టు సమాచారం. ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో శేఖర్ వ్యవహారంపై పంచాయితీ జరగనున్నట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News