: శశికళ వద్దే వద్దంటున్న తమిళ తంబీలు... ఆన్ లైన్ పిటిషన్ పై 50 వేలు దాటిన సంతకాలు
తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు దివంగత జయలలిత నెచ్చెలి శశికళ ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ, ఆమెను అంగీకరించబోమని చెబుతూ, 'ఛేంజ్ డాట్ ఆర్గ్' వెబ్ సైట్లో పెట్టిన పిటిషన్ పై సంతకాలు చేసిన వారి సంఖ్య 55 వేలను దాటింది. ఆమె సీఎం కాకుండా అడ్డుకోవాలని కోరుతూ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల కమిషన్, రాష్ట్ర గవర్నర్ లకు ఈ పిటిషన్ పంపుతున్నట్టు దీన్ని ప్రారంభించిన 'తమిళ్ అరసన్ పీఎస్ఆర్' తెలిపారు. నిన్న ఈ పిటిషన్ ప్రారంభం కాగా, నేడు మధ్యాహ్నం 1:15 గంటల సమయానికి దీనిపై సంతకాలు చేసిన వారి సంఖ్య 56 వేలు దాటింది. శశికళకు ప్రజామోదం లేదని, రాష్ట్రంలో తిరిగి ఎన్నికలు జరిపించాలని, ఆమె ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదని పిటిషన్ లో ఆరోపించారు. సీఎంగా పన్నీర్ సెల్వం కొనసాగాలని, లేకుంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రీ ఎలక్షన్ జరిపించాలని డిమాండ్ చేశారు.