: ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చిన యజమాని.. 5వేల కి.మీ తిరిగి, ఇంటింటికీ వెళ్లి గ్రీటింగ్స్ చెప్పిన వైనం!
జనవరి 28న చైనా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సందర్భంగా ఓ సంస్థ యజమాని చేసిన ఓ పని వార్తల్లో నిలిచి అందరితో శభాష్ అనిపించుకుంటోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సెలవులు రావడంతో ఉద్యోగులంతా సొంత ఊర్లకు వెళ్లిపోయారు. అయితే, ఆ దేశంలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో లిన్ జిగాంగ్ అనే ఓ సంస్థ యజమాని తన వద్ద పనిచేసే ఉద్యోగులందరి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. ఇందుకోసం 5వేల కి.మీ ప్రయాణించాడు.
ఆ విధంగా తన కంపెనీలో పనిచేస్తోన్న సుమారు 100 మందికిపైగా ఉద్యోగుల ఇంటికి వెళ్లి ఆయన శుభాకాంక్షలు తెలిపాడు. ఆయన వద్ద పని చేసే ఉద్యోగులందరూ ఒకే ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన వారే. తన కారులో వారి వారి గ్రామాలకు వెళ్లిన లిన్ జిగాంగ్.. ఒక్కో ఉద్యోగికి పేరు పేరునా శుభాకాంక్షలు చెప్పి, బహుమతులిచ్చాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో వారి ఇళ్లలోనే బస చేశాడు.
తమ యజమాని తమ ఇంటికి రావడం చూసిన ఉద్యోగులు ఎంతో షాక్‌కి గురై, ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు తన కంపెనీలో వున్న ఉద్యోగులంతా, తాను కంపెనీ ప్రారంభించిన దగ్గర్నుంచి తన వద్ద పని చేస్తున్న వారేనని, వారితో అంతటి అనుబంధం వుందని చెప్పాడు. వారి కుటుంబం నుంచే మరింత మంది యువకులు తన కంపెనీలో ఉద్యోగులుగా చేరుతున్నారని, తమది ఒక పెద్ద కుటుంబంలా ఉంటుందని వ్యాఖ్యానించాడు.