: ఎక్కడా ఆగకుండా 10 టైమ్ జోన్ లను దాటొచ్చి రికార్డు సృష్టించిన ఖతార్ విమానం
ప్రపంచంలో అత్యధిక దూరాన్ని ఆగకుండా ప్రయాణించిన రికార్డును ఖతార్ ఎయిర్ వేస్ సొంతం చేసుకుంది. దోహా నుంచి ఆక్లాండ్ కు బయలుదేరిన 'క్యూఆర్ 920' సర్వీస్ నంబర్ విమానం మొత్తం 14,535 కిలోమీటర్లను ప్రయాణించి ఈ ఉదయం షెడ్యూల్ సమయానికి 5 నిమిషాల ముందుగా 7:25కు ఆక్లాండ్ చేరుకుంది. మొత్తం 16 గంటలా 23 నిమిషాల పాటు విమానం ప్రయాణించిందని, మార్గ మధ్యంలో 10 టైమ్ జోన్ లను దాటిందని ఖతార్ ఎయిర్ వేస్ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
బోయింగ్ అందించిన 777-200ఎల్ఆర్ రకం విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ క్రూ ఉన్నారని, మొత్తం 1,100 టీ, కాఫీ కప్పులు, 2 వేల కూల్ డ్రింక్స్, 1,036 మీల్స్ సర్వ్ చేశామని పేర్కొంది. కాగా, గత సంవత్సరం మార్చిలో ఎమిరేట్స్ కు చెందిన విమానం దుబాయ్ నుంచి ఆక్లాండ్ కు 14,200 కిలోమీటర్ల దూరాన్ని నాన్ స్టాప్ గా ప్రయాణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఖతార్ విమానం ఆ రికార్డును మరుగున పడేలా చేసింది.