: ఉల్లంఘనల రాణి... చదివేది ఇంటరే, 64 తప్పులు చేసి దొరికిపోయిన విద్యార్థిని
ఒకసారి, రెండుసార్లు కాదు... ఏకంగా 64 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ విద్యార్థిని ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయింది. ఆమె చెప్పిన మాటలు విన్న పోలీసులే అవాక్కు కావాల్సిన పరిస్థితి ఎదురైంది. మైసూరు పరిధిలోని కేఆర్ మొహల్లాకు చెందిన గాయత్రి అనే విద్యార్థిని మరిమల్లప్ప కాలేజీలో మాధ్యమిక విద్యను అభ్యసిస్తోంది. ఇంటి నుంచి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని వెళ్లే ఈమె, బయట ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోనే పట్టించుకోదు. గాయత్రి ఉల్లంఘనలు పలు జంక్షన్లలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపి, బండిని సీజ్ చేస్తామని హెచ్చరిస్తే, వాహనం నంబర్ ప్లేట్ ను తీసి పక్కన పడేసి యథావిధిగా తన తప్పులను కొనసాగించింది.
ఈ క్రమంలో దేవరాజమొహల్లా ట్రాఫిక్ పోలీసులు నిన్న సాయంత్రం గాయత్రి బండిని ఆపిన వేళ, అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసింది. తనది కొత్త వాహనమని, తొలిసారి నిబంధనలు ఉల్లంఘించానని చెప్పింది. ఇదే సమయంలో ఆ బండి 7 వేల కిలోమీటర్లు తిరిగినట్టు చూపిస్తుండటంతో, పోలీసులు నిలదీశారు. దీంతో గాయత్రి తప్పు ఒప్పుకోగా, ఆమెపై మొత్తం 64 కేసులు పెండింగ్ లో ఉన్నాయని పోలీసులు గుర్తించారు. బైక్ ను సీజ్ చేసి, ఆమెను ఇంటికి పంపారు. జరిమానాలు వెంటనే చెల్లించాలని స్పష్టం చేసి, మరోమారు ఉల్లంఘిస్తే, కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.