: హిందూపురం టీడీపీలో ముదురుతున్న సంక్షోభం.. బాలయ్య ఆదేశాలను ఖాతరు చేయని నేతలు!


హిందూపురం టీడీపీలో సంక్షోభం క్రమంగా ముదురుతోంది. పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి సమావేశాలు నిర్వహించడం కానీ, అటువంటి సమావేశాలకు వెళ్లడం కానీ చేయవద్దని బాలకృష్ణ  పార్టీ నేతలకు సూచించారు. అయినా ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోని నేతలు తాజాగా సమావేశమయ్యారు. బాలకృష్ణ పీఏ శేఖర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం ఆదివారం కర్ణాటక బాగేపల్లి సుంకలమ్మ ఆలయం వద్ద సమావేశం నిర్వహించింది. శేఖర్‌ను వ్యతిరేకిస్తున్న నేతలతోపాటు పలువురు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. శేఖర్‌ను వారం రోజుల్లోగా హిందూపురం నుంచి పంపించివేయాలని సమావేశంలో తీర్మానించారు. లేదంటే పార్టీకి రాజీనామా చేసి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట దీక్ష చేస్తామని మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు, అంబికా లక్ష్మీనారాయణ హెచ్చరించారు.

కాగా  పీఏ శేఖర్ వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన బాలకృష్ణ శనివారం కొందరు నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. ఆయన ఆదేశాలతో హిందూపురంలోని ఆయన ఇంట్లోనే కొందరు స్థానిక నేతలు సమావేశమై పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ బయట సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అయినా వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా శేఖర్ వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించడం గమనార్హం.

  • Loading...

More Telugu News