: ‘ప్రత్యేక హోదా’ రాదని కేంద్రం ప్రకటించక ముందే చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మ
ఏపీకి ‘ప్రత్యేక హోదా’ రాదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించక ముందే సీఎం చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన ‘విభజన చట్టం- ప్రత్యేక హోదా-ప్రత్యేక ప్యాకేజ్’ సదస్సులో ఆమె మాట్లాడుతూ, హోదా కన్నా ప్యాకేజే మిన్న అంటున్న చంద్రబాబు తన స్వార్థప్రయోజనాల కోసమే కేంద్రానికి తలొగ్గారని ఆరోపించారు. ఈ విషయమై ప్రశ్నించిన ప్రజాసంఘాలు, మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తుందని, హోదా సాధించే దాకా వైఎస్సార్సీపీ విశ్రమించదని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు చేసే పోరాటంతో తమతో కలిసొచ్చే వారికి ఆహ్వానం పలుకుతామని వాసిరెడ్డి పద్మ అన్నారు.