: ఇండియాలో ఓటు వేసిన పాకిస్థానీ యువతి... ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు!
తన 35 సంవత్సరాల జీవితంలో తొలిసారిగా ఓటు వేశానని ఓ పాకిస్థాన్ యువతి సంబరపడుతోంది. పాకిస్థాన్ లో పుట్టి పెరిగిన తాహిరా మఖ్బూల్ అనే యువతి నిన్న పంజాబ్ లో జరిగిన ఎన్నికల్లో పాల్గొని ఓటేసింది. పాక్ లో నాన్ ఇస్లామిక్ వాదులుగా ముద్రపడ్డ అహ్మదీయ ముస్లిం వర్గానికి చెందిన తాహిరా, 2003 వరకూ పాక్ లోనే నివసించింది. తనకు 22 సంవత్సరాలు వచ్చే వరకూ అక్కడే ఉంది. ఆ సమయంలో ఎన్నడూ ఓటు వేసే అదృష్టం ఆమెకు దక్కలేదు.
ఇక ఆపై ఇండియాకు వలస వచ్చిన ఆమెకు గత సంవత్సరం ఏప్రిల్ లో భారత పౌరసత్వం లభించింది. దీంతో ఆమెకు ఓటు హక్కు రాగా, ఖైదాన్ నియోజకవర్గం ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు ఓటేసింది. వేలికి ఇంకుతో బయటకు వచ్చిన ఆమెను మీడియా చుట్టుముట్టగా, "ఓటు వేయడంతో నా జీవితానికి ఈద్ పండగ వచ్చినట్టుంది. భారత పౌరురాలిగా, ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన ఓటింగ్ లో పాల్గొనడం నాకెంతో గర్వకారణం. జాబితాలో నా నంబర్ 786. అంతకన్నా ఆనందం ఇంకేంటి?" అని చెప్పింది.
కాగా, పాక్, పంజాబ్ ప్రావిన్స్ లోని ఫైసలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగిన తాహిరా, డిసెంబర్ 7, 2003న ఖైదాన్ కు చెందిన చౌధురి మక్బూల్ అహ్మద్ ను వివాహం చేసుకుంది. ఈ ప్రాంతంలో మరో 12 మంది పాకిస్థాన్ మహిళలు భారత పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నారని, వారికి కూడా పౌరసత్వం ఇచ్చి అక్కున చేర్చుకోవాలని తాహిరా కోరింది.