: తాడోపేడో తేల్చుకోవడానికి.. తమిళ నిర్మాతల సంఘం ఎన్నికల బరిలోకి విశాల్.. నామినేషన్ దాఖలు
కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళ నటుడు విశాల్‌పై నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో జోరుమీదున్న విశాల్ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరగనున్న తమిళ నిర్మాతల సంఘం ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాడు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశాడు. నిర్మాతలు ప్రకాశ్‌రాజ్, పాండిరాజ్, ఎస్ఆర్ ప్రభు, మిష్కిన్, జ్ఞానవేల్ రాజా, సీవీ కుమార్, ఎస్ఎస్ కుమరన్, ఆర్కే సురేష్ తదితరులు విశాల్‌కు మద్దతు పలికారు. ప్రముఖ నటుడు కమలహాసన్ కూడా విశాల్‌కు మద్దతు తెలపడంతో ఈ సారి ఈ ఎన్నికలు రాజకీయ కోణం సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాల్ నామినేషన్ పత్రంలో కమల్ కూడా సంతకం చేశారు.
గతేడాది నడిగర్ సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి విజయ దుందుభి మోగించిన విశాల్ తాజా ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. వచ్చే నెల 5న మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరన్ పర్యవేక్షణలో నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. విశాల్ నామినేషన్‌తో ఈ పదవికి పోటీ చేస్తానని ప్రకటించిన ఖుష్బూ పోటీ నుంచి తప్పుకుంది. కార్యదర్శి, లేదంటే కోశాధికారి పదవికి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తాను తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. గెలిచాక హామీలు నెరవేర్చకుంటే వెంటనే రాజీనామా చేస్తానని పేర్కొన్నాడు. అంతేకాదు కావాలంటే రాజీనామా లేఖను కూడా ఇప్పుడే ఇస్తానని చెప్పాడు.