: అద్భుత ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచం..15నే ముహూర్తం!
ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అద్భుత ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. ఈనెల 15న ఉదయం 9.32 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ 37 రాకెట్ ద్వారా దేశవిదేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రయోగం కోసం ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలు షార్‌కు చేరుకున్నాయి. వాటికి పరీక్షలు పూర్తయిన అనంతరం ఈనెల 9న వాటిని రాకెట్‌కు అమరుస్తారు. 10, 11 తేదీల్లో రాకెట్‌కు తుది పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం 12న మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించి ప్రయోగ తేదీని, సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేసి 36 గంటల కౌంట్ డౌన్ నిర్వహిస్తారు.