: ఆ కారులో ఉప్పు వేస్తే చాలు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది!
నిజమే.. ఆ కారుకు ఉప్పే పెట్రోలు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారు పూర్తిగా విద్యుత్‌తో పనిచేస్తుంది. మరో విశేషం ఏంటంటే.. తనకు కావాల్సిన విద్యుత్‌ను అదే తయారు చేసుకుంటుంది. కాకపోతే కొంచెం ఉప్పు వేయాలి అంతే! జర్మనీకి చెందిన నానో ఫ్లోసెల్ అనే కంపెనీ దీనిని అభివృద్ధి చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో 48 వోల్ట్ పేరుతో ఈ కారును ప్రదర్శించనున్నారు. కారులో బ్యాటరీలకు బదులు ఫ్యూయల్ సెల్స్‌ను ఉపయోగించారు. సో.. బ్యాటరీ చార్జింగ్ అయిపోయిందన్న బాధ ఉండదు. ఉప్పు, ఇతర రసాయనాలను అందులో వేస్తున్నంత కాలం అది పరుగులు పెడుతూనే ఉంటుందన్న మాట. జెట్ స్పీడుతో ప్రయాణించే ఈ కారు 2.44 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగడం మరో ప్రత్యేకత. అయితే కారు ధర ఎంతో చెప్పడానికి నిరాకరిస్తున్న కంపెనీ దానిని మాత్రం అమ్మేది లేదని తెగేసి చెబుతోంది.