: ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం... పంజాబ్ లో విజయం తథ్యమంటున్న పోల్స్
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్ఫూర్తిగా, ఆయన అనుంగు శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరనుందని ఎన్నికల పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు పంజాబ్ లోనూ ఆప్ ప్రభుత్వం ఏర్పడనుందని, నిన్న ముగిసిన ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి 60 శాతం అవకాశాలు ఉన్నాయని సర్వేలు నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి. పంజాబ్ లో ఆప్ కే విజయావకాశాలు అధికమని ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్ రాయ్ వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తరువాత, తమ చానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించిన ఆయన, సంప్రదాయ అకాలీ ఓట్లు ఆప్ కు పడ్డాయని, ఇతర హిందువుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో మాత్రం ఆప్ కాస్తంత వెనుకంజలో ఉందని అన్నారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుతున్నారని అన్నారు. ఇక సర్వే నిర్వహించిన జీ న్యూస్ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ ఆప్ కు వస్తుందని, 80 సీట్లకు పైగా ఆప్ గెలుచుకోవచ్చని ప్రకటించింది. పంజాబ్ లో కుటుంబ పాలన పట్ల ఓటర్లు అసంతప్తితో ఉన్నారని తెలిపింది.